చెడ్దవాలకు కూడ మంచి చెయ్యండి

చెడ్దవాలకు కూడ మంచి చెయ్యండి

రామాయణంలో మందర పాత్ర గురించి తెలియని వారుండరు. కైకేయి చెలికత్తెగా రాముడిని వనవాసానికి పంపేందుకు సూత్రధారిగా నిలిచింది ఈ మందరే. ఆ పాపంతో తర్వాతి జన్మలో గూనితో మధురానగరిలో పుట్టింది మందర.

అంతేకాదు యౌవ్వనంలోనే ముసలి ముఖం కలిగినదిగా కన్పిస్తూ మధురానగరిని ఏలిన కంసుడి ఆస్థానంలో ఆయన సేవకురాలిగా నియమితురాలైంది. ప్రతి రోజా కంసుడి ఛాతీకి గంధంతో మర్ధనం చేయడం ఆమె పని.

అయితే కంసుడి కిరాతకం రోజురోజుకూ పెరుగుతుండటంతో అతడ్ని చంపేందుకు తన సోదరుడు బలరాముడితో పాటు మధురానగరి వచ్చాడు శ్రీకృష్ణుడు. మధురానగరిలో వస్తుండగా ఆయనను మందర కలుస్తుంది. ఆ సమయంలో ఆమెకు తన పూర్వజన్మ పాపం గురించి తెలియదు.

అయినప్పటికీ, సర్వాంగ శోభితుడైన శ్రీకృష్ణుడిని చూసి పులకించిపోయిన మందరా అక్కడే ఆయనను కూర్చోబెట్టి తన చేతులతో ఆయన ఛాతీపై గంధంతో మర్ధన చేస్తుంది. దీంతో పరవశించిపోయిన శ్రీకృష్ణుడు ఆమెకు గూని నుంచి విముక్తి కల్పించడమే కాక ఆమె ముఖానికి కూడా సరికొత్త అందాన్ని ప్రసాదించాడు.

రామాయణ కాలంలో తనకు ఆమె చేసిన చేటు గురించి కృష్ణుడికి తెలియంది కాదు. అయినప్పటికీ తనకు చెడు చేసిన వారిని కూడా ప్రేమించాలనుకునే భగవంతుడు మందరను కూడా అదే దృష్టితో అనుగ్రహిస్తాడు. మనం కూడా భగవంతుని రీతిలోనే మనకు చెడు తలచిన వారికి సైతం మంచి కోరాలన్నదే ఈ కథ సారాంశం.

Leave a comment