సహజనటనాసమస్తం – “సూర్యకాంతం”

నాకు నచ్చిన నటుల(నటీమణుల) లో సూర్యకాంతం ఒకరు,
ఆమె గురించి కొన్ని విషయాలు (తెలుగు జర్నల్ (కెబిఎస్ శర్మ ) సౌజన్యంతో) …

Surya kantham

పుట్టుకతో వచ్చిన పౌరుష లక్షణంతోపాటు, దురుసుగా కనిపించే మాటలతీరు, ఆమె తత్వమే అంత అని వెంటనే అనిపించే ధోరణి, నిర్మొహమాటం, వెక్కిరింపు, విమర్శ, కొంటెతనం, కర్రవిరిచి పొయ్యెలో పెట్టేలా మాటల తూటాలను వదులుతుంది అని భ్రమ కలిగించే ప్రవర్తన ఒక పార్శ్వమైతే, “ఒకరి బాధను నా సంతోషంగా తీసుకోలేను” అన్న మానవతాధోరణి కలిగిన వ్యక్తి. భారీ సహృదయత, సహాయతాధోరణి, పలికే ప్రతీమాటలో హస్య, చమత్కరాలతో మనోల్లాసాన్ని కలిగించే సజీవ నటనావిదుషీమణి.

సూర్యకాంతం వ్యక్తిత్వంలో కాంతిమయం

ఆమె ఎవరో కాదు, తెలుగు చిత్రాల్లో చిత్రవిచిత్రమైన పాత్రలద్వారా నటించడం కాక, ఆమూలాగ్రంగా జీవించి, ప్రేక్షకుల్ని అర్ధశతాబ్దకాలం తెలుగుచిత్రాల్ని తనపాత్రల్లో పరకాయప్రవేశం చేయించిన ఏకైక కళాకారిణి – సూర్యకాంతం.

సూర్యకాంతం – సూర్యరశ్మికి తగులుటచే నిప్పుకలిగెడు ఒక దినుసురాయి. సూర్మి (స్త్రీ, లోహపు ప్రతిమ), సూర్యానువర్తిని (పొద్దుతిరుగుడు) అని చెప్పబడే అర్ధాలు మన సహజ నటనాశిరోమణికి అక్షరాలాఅ వర్తిస్తాయి.

సూర్యకాంతం జీవనపర్వం

పొన్నాడ అనంతరామయ్య, వెంకటరత్నమ్మ దంపతులకు ఆంధ్రాప్రదేశ్, తూర్పుగోదావారి జిల్లాలోని వెంకటకృష్ణరాయపురం లో సూర్యకాంతం గారు ౨౮ అక్టోబర్ ౧౯౨౪న జన్మించారు. విశేషమేమిటంటే తల్లిదండ్రులకి సూర్యకాంతం ౧౪వ సంతానం. నారు పోసినవాడే నీరుపోస్తాడు అన్న విశ్వాసం ముమ్మరంగా ప్రబలుతున్నకాలం మరి. చిరుప్రాయం నుంచే పాడడంలోను, నాట్యంలోనూ ప్రవేశం కలిగింది. ఆరోజుల్లో మూడోఫారం వరకూ చదువుకున్నారు. చదువుకు మించిన జ్ణానసంస్కారాలే ఆభరణాలుగా అలంకరించుకున్నారు. విద్యకన్నా , ప్రపంచజ్ణానం, సంస్కారం అపరిమితాలుగా గోచరించే సూర్యకాంతం సుగుణభూషిత. నాటకాల్లోకూడ అభిరుచి, ప్రవేశం కలిగాయి. సూర్యకాంతంలో బయటకు పొక్కని మరో ప్రతిభ – రచయితగా కధలను వ్రాయడం, చిన్నప్పటినుంచి సరదాగా స్వీకారం చుట్టినా, ౧౯౫౧లో వ్రాసిన అనేక కధల్లో ఎక్కువగా అసంపూర్ణంగా మిగిలిపోవడం జరిగింది. నాటకరంగంలో మాత్రం సూర్యకాంతంకు మంచిపేరు తెస్సిపెట్టింది. పెద్దిభొట్లవారి కోడలయిన సూర్యకాంతం భర్త అనంతరామయ్య హైకోర్టు న్యాయవాది కావడం గమనార్హం. ఫలితంగా, ఆమె మాటల్లో అంత సాధికారత సాక్షాత్కరించేది.

నాటకాల్లో పురుషపాత్రలు

కాకినాడలో నాటకాలల్లో పురుషవేషాలను వేయడం విశేషం. తులాభారం, సక్కుబాయి, చింతామణి నాటకాల్లో అధ్బుతమైన నటనను ప్రదర్శించడమే కాక, ఆమె వేసిన మగవేషాల్లో ఆమెను పోల్చుకోలేకపోయేవారట. ఈమె పౌరుష వాచకాలకి పునాది యిక్కడే కావచ్చు అని పలువురు భావిస్తారు. హిందీసినీమాల బొమ్మల్ని చూసి ప్రభావితం అయ్యారు. ఆనాటి చలనచిత్రపరిశ్రమ రాజధాని మద్రాసుకి చేరుకున్నారు.

సినీమారంగలహరిలో … అలలు, తరంగాలు

జెమినీసంస్థ “చంద్రలేఖ” లో నాట్యకళాకారిణిగా శుభారంభం అయితే, ద్వితీయావకాశం “ధర్మాంగద”లో మూగపాత్రలో రాణించింది. ఓ మోస్తరు స్థాయిలో పాత్ర “నారద నారది” లో వచ్చింది. ప్రతిభను పరిధిలో గిరిగీస్తే, నిరాశ తప్పదు. మనసు బొంబాయి వైపుకు లాగుతున్నా, ఆలోచనలకు స్వస్తి చెప్పడం, “గృహప్రవేశం” లో మరొక అవకాశం వచ్చింది. కాని, ఎదురుచూసిన నాయకి పాత్ర “సౌదామిని” చిత్రంలో లభించినా, రోడ్డుప్రమాదంలో ముఖానికి తగిలిన గాయం వల్ల వదులుకోవలసివచ్చింది. చిన్న యిబ్బంది వచ్చినా, స్థిరత్వం కలిగించే అత్తగారి పాత్ర మాత్రం ఆవహించింది. తిరిగి చూసుకోవాలసిన అవసరం లేని ఆ మొదటి అనుభవపు అత్తగారు “సంసారం” లో రేలంగీ పాత్రలో తల్లిగా అధ్బుతంగా జీవించింది. తర్వాత, ధర్మాంగద, గృహప్రవేశం, రత్నమాల, మదాలస, సంసారం, రూపవతి, చిన్నకోడలు, కోడరికం, ప్రేమ చిత్రాలు సూర్యకాంతం నటనకు కలికితురాయిలుగా మారాయి. మొదటి ౧౦ చిత్రాల్లోనే అన్ని తరహాల పాత్రల్లో రాణించడం సూర్యకాంతానికే చెల్లింది.

అసామాన్యాలు ఆ సాంఘికాలు

౫౦ దశకం – సంసారం, పెళ్ళిచేసిచూడు, బ్రతుకుతెరువు, కన్యాశుల్కం, దొంగరాముడు, చరణదాసి, భాగ్యరేఖ, తోడికోడళ్ళు, దొంగల్లోదొర, అప్పుచేసికూడు, మాంగల్యబలం మరువరాని, మరువలేని చిత్రమరువాలు.

౬౦ దశకంలో సూర్యకాంతి విరాజిల్లింది. ఫలితంగా, ప్రతీ చిత్రంలోనూ పేరుతెచ్చుకుంది. శాంతినివాసం, ఇద్దరుమిత్రులు, భార్యాభర్తలు, వాగ్దానం, వెలుగునీడలు, కలసి ఉంటే కలదు సుఖం, మంచిమనసులు, రక్తసంబంధం, సిరిసంపదలు, గుండమ్మకధ, పరువుప్రతిష్ట, చదువుకున్న అమ్మాయిలు, మురళీకృష్ణ, మూగమనసులు, డాక్టర్ చక్రవర్తి, ఉయ్యాల జంపాల, నవరాత్రి, సంగీతలక్ష్మి, ఆస్తిపరులు, కన్నెమనసులు, బ్రహ్మచారి, సుఖదు:ఖాలు, ఉమ్మడికుటుంబం, అత్తగారు-కొత్తకోడలు, బుద్ధిమంతుడు, ఆత్మీయులు

70 దశకం – ప్రముఖ దర్శకుడు బాపు అందించిన “బాలరాజు కధ”తో ప్రారంభించి, చిత్రసీమకు ఒక మలుపు-మెరుపుతోపాటు, ఒక రూపు-ఊపునిచ్చిన దసరాబుల్లోడు, అమాయకురాలు, కొడుకు కోడలు, అందాలరాముడు, ముత్యాలముగ్గు, సెక్రటరీ, గోరంతదీపం, రాధాకృష్ణ, కార్తీకదీపం, వియ్యాలవారికయ్యాలుతో దశకాన్ని పూర్తిచేశారు.
చుట్టాలున్నారు జాగ్రత్త, పెళ్ళిచూపులు, బంధువులు వస్తున్నారు జాగ్రత్త, వన్ బయ్ టూ చిత్రాలు సూర్యకాంతంగారి చిత్రతరంగాల జోరు తగ్గిందని చెప్పవచ్చు.

కేవలం సాంఘికాలే కాదు

సూర్యకాంతం నటించిన సాంఘిక, కుటుంబకధాచిత్రాల్లోని పాత్రల్లో ప్రవేశించి నేటికీ తిరిగివచ్చే ప్రయత్నం చేయలేదు; ఆ ప్రయత్నం సాధ్యం కాదు కూడ. వీటితోపాటు, తొలిదశలోని ధర్మాంగద, కృష్ణలీలలు, జయభేరి, తిరుపతమ్మకధ, నర్తనశాల చిత్రాలు ఎప్పటికీ చిరస్మరణీయాలు.

సూర్యకాంతం చిత్రవ్యక్తిత్వం

చిత్రాల్లో సూర్యకాంతం పాత్రకు తోడుగా నటించే నటుల్లో ఎక్కువగా ప్రముఖులు – రేలంగి, రమణారెడ్డి, రంగారావు, నాగభూషణం నటుల ప్రతిభను కూడ జతగానే విశ్లేషించాలి. సహజ కుటుంబ వాతావరణాన్ని సృష్టించడంలో న్యాయం చేకూర్చడానికి సూర్యకాంతం వహించిన పాత్ర శ్లేఘనీయం, ప్రశంసనీయం. కేవలం హాస్యనటీమణి అని చెప్పడం ఆమె ప్రతిభాపాండిత్యాన్ని అంచనా వేయడం తెలియకనే అని చెప్పాలి. సంభాషణాశైలి, చేష్టలు, కదలికలు, కళ్ళతిప్పులాటలు, చేతివాటాలు సూర్యకాంతం మాత్రమే ప్రదర్శించదగినవి, అనుకరణకు సాధ్యంకాని అసామాన్యాలు.

సూర్యకాంతం గురించి అందరూ అనుకునే ప్రముఖ భావాభావాలు

ఎంత కొత్తవారు కనిపించినా, చాలా దురుసుగా మాట్లాడుతుంది; ఆమె తత్వమే అంత. ఈమెకి పౌరుషం అనేది పుట్టుకతోనే వుందేమో. మాటలతీరు చూస్తే అందరికీ కోపం ఒస్తుందే. ఏమాటైనా మొహంముందే నిర్మొహమాటంగా, కర్రవిరిచి పొయ్యిలో పెట్టినట్లు చెబుతుంది! ఒక్కొక్కసారి వెక్కిరింపు, విమర్శ, కొంటెతనం, అన్నీ వినిపిస్తాయి. ఏ చిత్రంలోనైనా ఆడ రౌడీ పాత్రలు కావాల్సివస్తే, కత్తులు, తుపాకులు అవసరంలేని మాటల తూటాలతో పాత్రకున్యాయం చేకూర్చగల ప్రతిభావంతురాలు. ఎవరినా, “ధధిగిణ ధోం” అని ఆమె ధోరణులకు వంతు పాడవలసినదే. ఏ దర్శకుడు, నిర్మాత అయినా సరే, సూర్యకాంతం పద్ధతికి అంగీకరించవలసినదే. మాటలు సూదుల్లా గుచ్చుకునేలా వున్నా, మనసులోమాత్రం వాటికి వెన్న, తేనె పూసింది అన్నది కొందరికే తెలిసిన విషయం. అందం అంటే కేవలం భౌతికం కాదు, మనసు, మాట, హృదయం ఎలా ప్రవర్తిస్తుందో దాన్నిబట్టి అందాన్ని అంచనా వేయాలి అంటే, సూర్యకాంతం వ్యక్తిత్వాన్ని ప్రప్రధమంగా చెప్పాలి. దరికిరానీయని గర్వం, అహంకారం కేవలం పాత్రలకే పరిమితం చేస్తూ న్యాయం చేకూర్చడం, ఏ రకమైన పాత్రనైనా చాకచక్యంతో అవలీలగా అర్ధం చేసుకుని నటించగలిగే సామర్ధ్యంగల తారాకాంతం, సూర్యకాంతం. ఆడంబరంలేని తార. కొందరి తారలను కూడ బహిరంగంగా విమర్శించడానికి వెనుకాడలేదు. భర్త న్యాయవాది కనక, ఈమె మాట్లాడే ప్రతీ విషయంలో చక్కటి తర్కం, విశ్లేషణలతో వుండేవి. ఈమె మనస్తత్వాన్ని గ్రహించిన దర్శకుడైతే, సూర్యకాంతాన్ని అద్భుతంగా ఉపయోగించుకునే అవకాశాలు వాటంతట అవే కలుగుతాయి- అనే భావనలు పలువురిభావనాసారం.

తెలుగుకోడళ్ళకు గుండె చాలా బలం వుండాలి, అమ్మో! ఆవిడా! సూర్యకాంతమా! అని అనుకున్నా, వాస్తవానికి విసుగులేని మూస పాత్రలైనాకాని, వైవిధ్యాన్ని అందించిన ఘనత ఈమెదే.
నువ్వు తెలుగుభాషకు చేసిన అన్యాయం ఒకటుంది; “సూర్యకాంతం” అని చక్కని పేరు ఇంకెవరూ పట్టుకోకుండా చేశావు” – గుమ్మడి వెంకటేశ్వరరావు.
“పాత్ర తిట్టిందమ్మా! నువ్వు ఎందుకు బాధపడతావు” అని ఓ పాత్రద్వారా నాగయ్య పాత్రను తిట్టినందుకు అపరాధం క్షమించండీ అని ఆయన కాళ్ళమీద పడి మన్నించండి అని వేడుకోవడం లోనే, ఎప్పుడూ నాన్నగారూ అని నాగయ్యను పిలిచే, ఆమె మనసుచల్లదనం బయటపడుతుంది.
అత్తగారుగా వెలిగిన ఆమెను, అక్కగారు, దొడ్డమ్మగారు, పెద్దవారు “కాంతమ్మా౧” అని పిలవడంపట్ల సూర్యకాంతం అందరి వయసువారికి దగ్గరిబంధువు.
న్యాయంగా ఆమె వేసే పాత్రల్ని బట్టి “అత్తగారూ” అని పిలవడం ధర్మం; “ఆమ్మో! బయటకూడా అలా పిలిస్తే ఈ కోడళ్ళం బతికినట్లే! – అని మహానటి సావిత్రి చమత్కారవ్యాఖ్యానం.

అసలు సంగతి యిదండీ!

కేవలం హాస్యనటీమణి, దుష్టపాత్రధారిణి అనడం సబబుకాదు, సహాయనటి అని మాత్రమే అనాలి. కాని పాత్రలో లీనమైనప్పుడు – అరమీరిన దురుసుతనం, ధాటిగా తిట్లు, దూషణ భూషణ తిరస్కారాదులు, ఈనాడు వచ్చే ఉపిరిపీల్చకుండా చెప్పే సంభాషణలు సూర్యకాంతం ఏనాడో చెప్పింది – ఒక్క ధర్మాంగద లో తప్పితే (మూగపాత్ర కాబట్టి).
నేను విదేశాలన్నీ తిరిగొచ్చినదాన్ని” అని ఒక పాత్ర అన్న మాటలకి బదులుగా – నువ్వేమిటీ! ముక్కాణీ పోష్టుకార్డు వెళ్తూంది” అని కోడరికం అన్న చిత్రంలోని సూర్యకాంతం మాటలు నేటికీ ముత్యాలమూట అనే చెప్పాలి.

చివరిగా సూర్యకాంతం నిర్వచనం

నటనద్వారా అందాన్ని, ఆనందాన్ని ప్రసాదించిన విదుషీమణి. ఓరచూపులు చూస్తూ, ఎడంచెయ్యి విసురుతూ, కుడిచెయ్యిని నడుంమీద నిలబెట్టి విసరిన సంభాషణాచాతుర్యాల్లో వెక్కిరింపులు, కల్లబొల్లికబుర్లు చోటుచేసుకున్నా, ప్రతీమాట, ప్రతీసన్నివేశం సజీవశిల్పం. అల్పంలో అనల్పం, సూక్ష్మంలో మోక్షం – వెరసి పెద్దిభొట్ల సూర్యకాంతం. గయ్యాళి అత్తకు మరోపేరు. మనసున్న అమ్మకు సమానార్ధ్ం. అందుకే – తెరపైన “అత్త”, తెరవెనుక “అమ్మ” అన్న నిర్వచనం సరిసములులేని భావన. చిత్రాల్లో సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు, సహనటీనటులకు యింటినుంచి షడ్రసోపేతమైన ఆహారభోజనాల్ని తెచ్చిపెట్టడం, ఆ రుచులతో గయ్యాళితనాన్ని మరచిపోయి, మనసున్న మహామనీషిగా గుర్తింపు అలవోకగా తెచ్చుకుంది. పులిలా కనిపించే ఈమె హస్తవాసితనం పులిహోర తయారీలో సిద్ధహస్తురాలు, గోలచేయని గోంగూరపచ్చడి, మాయామర్మంలేని ఆవకాయ, అధ్బుతాల్ని అందించే అల్లంపచ్చడి, కన్నులవిందైన కందిపొడితోపాటు బిగుతైన డబ్బాతో ఘుమఘుమలాడే నేతిసరుకుని కూడ యింటినుంచి దిగుమతిచేసుకునివచ్చి, వివాహభోజనసమానమైన బలేపసందుల విందును అనుభవించేవారు

“సూర్యకాంతం” వ్యక్తిత్వం, నటన, ఈ ధరణిపై సూర్యకాంతి, చంద్రునిచల్లదనం ఉన్నంతవరకూ, సూర్యకాంతమ్మ సూరజముఖిలా వికసిస్తూ, నిత్యం కాంతినిస్తూ తెలుగుప్రజను నిండుగా అలరిస్తూనే వుంటుంది అన్నదాంట్లో ఆశ్చర్యం, విడ్డూరం లేని పరమసత్యాలు.

సూర్యకాంతం జన్మతిధి – అక్టోబర్ 28 (1924) .

మరికొంత మంది మహానుభావుల వివరాలు కొరకు ఇక్కడ చూడండి,మన మహానుభావులు.

Advertisements

3 Responses to “సహజనటనాసమస్తం – “సూర్యకాంతం””

 1. radhika Says:

  thanku

 2. rajeev Says:

  useful and information shows hard work….

 3. murali Says:

  (తెలుగు జర్నల్ (కెబిఎస్ శర్మ ) సౌజన్యంతో) …
  idi labhinche avakasham unda

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s


%d bloggers like this: